manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 9:20 am Editor : manabharath

పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై దోపిడీ..

పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై దోపిడీ.. శ్రీ చైతన్య స్కూల్‌పై ఏబీవీపీ ఆగ్రహం.
వనపర్తిలో ఏబీవీపీ ఆందోళన – విద్యాశాఖ అధికారుల జోక్యం, యాజమాన్యంపై చర్యలకు సూచన

మన భారత్‌, వనపర్తి, నవంబర్‌ 13: వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్‌లో పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థులపై అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ఘటన విద్యార్థి సంఘాలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) నేతలు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు.

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ .. “ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు కేవలం ₹125 మాత్రమే ఉండాలి. కానీ ఈ స్కూల్‌ యాజమాన్యం ప్రతి విద్యార్థి నుండి ₹800 చొప్పున వసూలు చేస్తోంది, ఇది పూర్తిగా దోపిడీ చర్య” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ సంఘటనపై స్పందించిన వనపర్తి మండల విద్యాధికారి కే. మద్దిలేటి స్వయంగా స్కూల్ వద్దకు చేరుకొని విద్యార్థులను, యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రిన్సిపాల్‌ ద్వారా అధిక ఫీజులు వసూలు చేసిన విషయంపై లేఖ రాయించుకున్నారు.

అదేవిధంగా, ప్రభుత్వ సెలవు దినాల్లో స్కూల్‌ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ ఆందోళనలో ఏబీవీపీ నాయకులు నందు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఇలాంటి దోపిడీ చర్యలను ఇక భరించమని వారు హెచ్చరించారు.