manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 6:28 am Editor : manabharath

“షీ”టీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు..

🚨 రాముని చెరువు పార్క్‌లో వెకిలిచేష్టలు.. షీటీమ్ ఉచ్చులో ఆరుగురు ఆకతాయిలు!

డెకాయ్ ఆపరేషన్‌తో పట్టుకున్న పోలీసులు – మహిళల భద్రతే మా ప్రాధాన్యం: ఎస్ఐ ఉషారాణి

 

మన భారత్‌, మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్క్ వద్ద మహిళలను వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను షీటీమ్ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పార్క్‌లో తరచూ యువతులు, మహిళలు వెకిలి చేష్టలకు గురవుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో, పోలీసులు డెకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు.

షీటీమ్ సిబ్బంది సివిల్‌ దుస్తుల్లో పార్క్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించగా, కొంతమంది యువకులు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, ఫోన్‌లో వీడియోలు తీస్తూ వేధింపులకు పాల్పడినట్లు తేలింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.

వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మహిళల పట్ల గౌరవం, చట్టపరమైన పరిణామాల గురించి వివరించినట్లు షీటీమ్ ఎస్ఐ ఉషారాణి తెలిపారు. “మహిళల భద్రతకు మేము ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాము. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే 100 లేదా షీటీమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి” అని ఆమె సూచించారు.