గాయపడిన వారికి మెరుగైన వైద్యం.. శాంతిభద్రతల బలోపేతంపై సీఎం దృష్టి
మన భారత్,న్యూఢిల్లీ, నవంబర్ 11:ఢిల్లీలో జరిగిన భయానక పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, శాశ్వత వికలాంగులైన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు.
సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “మరణించిన వారి కుటుంబాలకు ఇది భర్తీ కాని నష్టం. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తాం. గాయపడిన వారందరికీ ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తాం. ఢిల్లీ శాంతిభద్రతలు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత,” అని పేర్కొన్నారు.
అదేవిధంగా పేలుడు ఘటనకు కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు హైఅలర్ట్‌లో ఉన్నాయని తెలిపారు.