manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 4:14 pm Editor : manabharath

ఉగ్రవాది మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు..

ఉగ్రవాది మొయినుద్దీన్‌ విచారణలో సంచలన విషయాలు.. ప్రజల నీటిలో విషం కలిపి హత్యా కుట్ర!

పాకిస్తాన్ హ్యాండ్లర్ సూచనల మేరకు ప్రాణాంతక రసాయనం ‘రెసిన్‌’ తయారీ – గుజరాత్‌ ఏటీఎస్‌ భయానక యోజనను బహిర్గతం చేసింది

 

హైదరాబాద్‌, నవంబర్ 11:అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌ విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌ ఏటీఎస్‌ బృందం ఇటీవల హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో అతనిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో అతను దేశవ్యాప్తంగా ప్రజలను చంపే భయానక కుట్ర పన్నినట్లు అధికారులకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి.

పోలీసుల ప్రకారం, మొయినుద్దీన్‌ ‘రెసిన్‌’ అనే అత్యంత ప్రాణాంతక రసాయనాన్ని తయారు చేస్తూ, దానిని దేవాలయాల నీటి ట్యాంకులు, పబ్లిక్‌ వాటర్‌ ట్యాంక్‌లలో కలపాలన్న దుష్ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈ కుట్ర ద్వారా ఒకేసారి వందలాది మందిని విషప్రయోగం చేసి చంపాలనే ఉద్దేశ్యంతో పనిచేసినట్లు అనుమానిస్తున్నారు.

గుజరాత్‌ ఏటీఎస్‌ అతని నివాసం వద్ద రెసిన్‌ తయారీలో ఉపయోగించే పలు రసాయనాలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, డిజిటల్‌ ఆధారాలు స్వాధీనం చేసుకుంది. విచారణలో మొయినుద్దీన్‌ పాకిస్తాన్‌లోని తన హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వెల్లడైంది.

సమాచారం ప్రకారం మొయినుద్దీన్‌ చైనాలో MBBS చదివి, తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ఆన్‌లైన్‌ వైద్య సేవలు అందిస్తూ తన ఉగ్ర కార్యకలాపాలను గోప్యంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్‌ ఏటీఎస్‌ అతనితో పాటు నలుగురు అనుచరులను అరెస్ట్‌ చేసింది.

మొయినుద్దీన్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రత్యేక విచారణ బృందం పని చేస్తోంది. అతని నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం చెబుతోంది.