manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 8:37 am Editor : manabharath

20.76 శాతం పోలింగ్ నమోదు..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్న పోలింగ్

 

హైదరాబాద్, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రారంభం నుండి పోలింగ్ సజావుగా కొనసాగుతుండగా, ఎక్కడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. కొద్ది సేపటికి షేక్‌పేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించిందని, కానీ టెక్నికల్ బృందం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిందని చెప్పారు.

మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను యుద్ధప్రాతిపదికన సరి చేయడం జరిగింది. ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైందని ఆర్వీ కర్ణన్ తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి పహారా కాస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్లను శాంతంగా, క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.