ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం భద్రతా దళాల హైఅలర్ట్ – స్టేషన్లు, బస్టాండ్లలో కఠిన చెకింగ్‌లు
మన భారత్, హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించారు. నగరంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రజా రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్ఫ్‌పీ (RPF) సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు అనుమానాస్పద లగేజీలు, వాహనాలు, వ్యక్తులపై కఠినంగా తనిఖీలు చేపట్టాయి. రైల్వే ప్లాట్‌ఫారంలు, వేయిటింగ్ హాల్స్, పార్కింగ్ ఏరియాల వద్ద భద్రతా చర్యలు మరింత బలోపేతం చేశారు.
ఇక, సీఐఎస్‌ఎఫ్ (CISF) దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పారిశ్రామిక ప్రాజెక్టులు, రక్షణ స్థావరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.