జైనథ్‌లో అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద
లక్ష్మీపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – రైతుకు తీవ్ర నష్టం
మన భారత్, జైనథ్, నవంబర్ 10: జైనథ్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవ్ దీపక్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే అగ్ని ప్రమాదం తీవ్రరూపం దాల్చి పరిసర ప్రాంతాలను ఆందోళనకు గురి చేసింది.
మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చివరకు మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమై బూడిద అయిందని అధికారులు తెలిపారు.
పత్తి సీజన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో రైతు దీపక్ కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల వల్ల ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు.