అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం..
“తెలంగాణకు తీరని లోటు” – కేసీఆర్ స్పందన
మన భారత్, హైదరాబాద్: ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తెలంగాణకు తీరని లోటుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా, గీత రచయితగా అందెశ్రీ చేసిన కృషి అపారమని కేసీఆర్ స్మరించారు. “జయ జయ హే తెలంగాణ” వంటి ఆవేశభరిత గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమానికి ఆత్మస్వరూపుడని అన్నారు.
ఉద్యమ దశలో అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లో – “తెలంగాణ ఆత్మను పాటల రూపంలో ప్రజల హృదయాల్లో నాటిన అందెశ్రీ లాంటి మహానుభావుడి మరణం నాకు వ్యక్తిగతంగా చాలా బాధాకరం” అన్నారు.
దివంగత అందెశ్రీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.