manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 10:42 pm Editor : manabharath

అవినీతి సహించేది లేదు.. కలెక్టర్ రాహుల్ రాజ్

అవినీతిని అసలు ఉపేక్షించేది లేదు.. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక

మన భారత్‌, మెదక్ జిల్లా, నవంబర్ 4: అధికారులు లేదా సిబ్బంది అవినీతి మరకలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి అనేది అత్యంత ప్రమాదకర నేరం అని, దానిని నిర్మూలించకపోతే అది సర్కిల్‌లా తిరిగి అందరినీ ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని శాఖల పనితీరుపై తాను ప్రత్యేక దృష్టి సారించానని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం నేరం మాత్రమే కాదు, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు. “అవినీతి ఆలోచన ఉన్నవారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి,” అంటూ రాహుల్ రాజ్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.

అధికారుల ప్రవర్తనలోని అనైతిక చర్యల వల్ల వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కోల్పోతుందని, ప్రజల భరోసాను నిలబెట్టడం ప్రతి ప్రభుత్వాధికారుడి కర్తవ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.