manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 10:18 pm Editor : manabharath

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత..

ప్రేమికుల పరారుతో ఉద్రిక్తత – అబ్బాయి ఇంటిపై దాడి, మంటల్లో కక్కర్‌వాడ కలకలం!

మన భారత్, సంగారెడ్డి జిల్లా, నవంబర్ 4:

జిల్లాలోని ఝరాసంగం మండలంలోని కక్కర్‌వాడ గ్రామంలో అంతర్‌జాతి ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమజంట 10 రోజుల క్రితం పరార్‌ కావడం, కుటుంబాల మధ్య ఘర్షణకు కారణమైంది.

తాజాగా, అమ్మాయి బంధువులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఇంటి ముందు కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మంటలు పక్కనే ఉన్న రేకుల షెడ్‌లోని పత్తికి కూడా అంటుకోవడంతో అగ్ని మరింత విస్తరించింది.

స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలను మోహరించారు. ప్రేమజంట పరార్‌ ఘటనకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.