manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 9:53 pm Editor : manabharath

కొడంగల్‌లో అక్షయపాత్ర సదుపాయం..

 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్న ఫౌండేషన్

మన భారత్, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి నవంబర్ 14న కొడంగల్‌లో జరగనున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించారు.

కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో ఈ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.7 చొప్పున ఖర్చు చేస్తుండగా, అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక్కో విద్యార్థిపై దాదాపు రూ.25 వరకు వ్యయం చేయనుంది. నాణ్యమైన ఆహారం తయారీ, సరఫరా, పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వం చెల్లించే మొత్తానికి అదనంగా అయ్యే ఖర్చును ఫౌండేషన్ స్వయంగా భరిస్తోంది. ఇందుకోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వినియోగించనుంది. గత ఏడాది నుంచే ఈ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు అల్పాహారం పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర జిల్లాల్లో కూడా అక్షయపాత్ర మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.