ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో యువ కానిస్టేబుల్ దుర్మరణం
మన భారత్, సంగారెడ్డి, నవంబర్ 4: ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ మత్తు మరో కుటుంబాన్ని కూలదోసింది. సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద సందీప్ (కానిస్టేబుల్) తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీసు వర్గాలు షాక్‌కు గురయ్యాయి.
సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏడాదిగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ గ్రామానికి చెందినవాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ పట్ల అతనికి తీవ్రమైన వ్యసనం ఏర్పడినట్లు సమాచారం. ఈ వ్యసనం కారణంగా అతను భారీగా డబ్బులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయాడు.
సమాచారం ప్రకారం, బెట్టింగ్ కోసం తన సహచర పోలీసుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు తీసుకున్న సందీప్, ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సహచరులు అప్పులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయి చివరికి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. సీనియర్ అధికారులతో కలిసి సాక్ష్యాధారాలను సేకరిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో పోలీసు శాఖలోనే కాకుండా, స్థానిక ప్రజల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం యువతలో పెరుగుతోందని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.