manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 2:54 pm Editor : manabharath

భూ భారతి పరిష్కారంలో ముందంజ..

10 రోజుల స్పెషల్ డ్రైవ్ ఫలితంగా 1,012 కేసులు క్లియర్: కలెక్టర్ రాహుల్ రాజ్

మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2:భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా పరిపాలన చేపట్టిన 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు, భూస్వాములకు పెండింగ్‌లో ఉన్న అనేక దరఖాస్తులను పరిష్కరించగలిగామని ఆయన తెలిపారు.

కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడిస్తూ..“జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలలో మొత్తం 1,012 భూభారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాం. ఇందులో తహసీల్దార్ పరిధిలో 183, ఆర్డీవో పరిధిలో 661, కలెక్టర్ స్థాయిలో 168 ఫైళ్లను క్లియర్ చేయడం జరిగింది,” అని తెలిపారు.

అదేవిధంగా 1424 ఫైల్స్ తహసీల్దార్లు విచారణ పూర్తి చేసి ఆర్డీవోలుకు పంపగా, 76 ఫైళ్లు ఆర్డీవోల నుండి అదనపు కలెక్టర్కు, 61 ఫైళ్లు అదనపు కలెక్టర్ నుండి కలెక్టర్కు పంపబడ్డాయి. మొత్తంగా ఈ 10 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో  2573 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పరిష్కార దశకు చేరుకున్నాయి. కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తూ

“ప్రతి ఒక్క దరఖాస్తును నిష్పక్షపాతంగా, వేగవంతంగా పరిష్కరించాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పని చేయాలి,” అని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం ప్రభావవంతంగా కొనసాగుతుందని, ఈ డ్రైవ్ ద్వారా పరిపాలనా పారదర్శకత పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.