కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్
మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన “అహనా పెళ్లంట” వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు స్పందన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీనే ఆ వ్యాఖ్యలకు తగినదని కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “సినిమాలో కోడిని వేలాడదీసి ఆశ చూపినట్టు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్‌ది,” అని మండిపడ్డారు.
అదే విధంగా, “జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీఆర్ఎస్, బీజేపీ ఒకే నాణెం రెండు వైపులా,” అని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ కావాలనే బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని, ఇది బీఆర్ఎస్‌తో ఉన్న రహస్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు.
“పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించింది. ఎన్డీఏ తీసుకున్న ప్రతి పెద్ద నిర్ణయంలో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉంది,” అని అన్నారు. “రాష్ట్రపతి ఎన్నికల నుండి ట్రిపుల్ తలాక్ వరకు బీజేపీకి మద్దతు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్‌ది,” అని దుయ్యబట్టారు.
కేటీఆర్ ప్రజల వద్ద డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే రూ.5 వేలు తీసుకోండి కానీ బీఆర్ఎస్‌కు ఓటేయండి” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్య ప్రజాస్వామ్యానికి విఘాతం అని మండిపడ్డారు.
ఎలక్షన్ కమిషన్ కేటీఆర్ పై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మెజార్టీగా అమలు చేసిందని, ప్రజల ఆశీస్సులు పొందుతామని అన్నారు.
“తెలంగాణ వచ్చిందంటే ఉద్యోగాలు వస్తాయని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్‌ది. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు వచ్చాయి. బీఆర్ఎస్ నిజమైన ప్రజా సేవకుల పార్టీ కాదు,” అని మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ వద్దని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు.