manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 1:11 am Editor : manabharath

రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవు: తలసాని ఫైర్

రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవు: తలసాని ఫైర్

మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1: సీఎం రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవని, ప్రజలను భయపెట్టే ధైర్యం ఎవరికీ ఉండదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలసాని మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజలను పథకాలు ఆగిపోతాయంటూ బెదిరిస్తున్నారా? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు ఆగుతాయని చెప్పడం ప్రజాస్వామ్యానికి అవమానం” అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటాల ద్వారా సంక్షేమ పథకాలు వచ్చినవని, అవి ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

“సంక్షేమ పథకాలు ఆగితే ఎలా పోరాటం చేయాలో, అసెంబ్లీని ఎలా స్తంభింపచేయాలో మాకు బాగా తెలుసు,” అని తలసాని హెచ్చరించారు. అసెంబ్లీలో పని చేయకుండా కేవలం ప్రసంగాలతోనే పేరు తెచ్చుకునే ఎమ్మెల్యేలకంటే, ప్రజల్లో ఉంటూ సేవచేసే నాయకులు విలువైనవారని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన సేవలను ఆయన ప్రశంసించారు.

కాశీబుగ్గలో తొక్కిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, తలసాని రేవంత్ రెడ్డికి భాషలో మార్పు అవసరమని సూచించారు. “సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఓపీనియన్ పోల్కు సిద్ధమవ్వాలి. 23 నెలల్లో ఆయన హైదరాబాద్‌లో ఎక్కడ తిరిగారో చెప్పాలి,” అని సవాల్ విసిరారు.

హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ₹44 వేల కోట్లు ఖర్చు కాగా, కాంగ్రెస్ కేవలం ₹4,600 కోట్లు మాత్రమే పెట్టిందని పేర్కొన్నారు. “హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా?” అంటూ ప్రశ్నించారు.

అంతేకాక, కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ గెలిచిన తర్వాత 4 వేల కోట్లు ఖర్చు చేశారంటున్నారు, అది నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా,” అని తలసాని సవాల్ విసిరారు.

ముస్లిం మంత్రిపదవి అంశంపై మాట్లాడుతూ, “బీఆర్ఎస్ డిమాండ్ వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల భయంతోనే రేవంత్ ఆయనను మంత్రివర్గంలోకి చేర్చారు,” అని ఆరోపించారు.

రేషన్ కార్డులు, సన్న బియ్యం అంశంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే నేనే రాజీనామా చేస్తా. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం దారుణం,” అని అన్నారు.

తలసాని చివరగా మాట్లాడుతూ, “హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని స్థాయికి ఎదిగింది. ఈ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కస్‌లా నడుపుతోంది. రేవంత్ భయపెట్టే రాజకీయాలు చేయడం మానుకోవాలి,” అని మండిపడ్డారు.