manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 10:13 am Editor : manabharath

కోతుల బెడద పరిష్కరించాలని డిమాండ్

కోతుల బారిన పడుతున్న గూడూరు గ్రామం  ప్రజలు తీవ్ర ఇబ్బందులు

మన భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:  ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కోతుల ఉచ్చాటన సమస్య తీవ్రరూపం దాల్చింది. గత రెండు నెలలుగా గ్రామంలో కోతులు దాడులు చేస్తూ గ్రామ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. స్కూల్‌కి వెళ్లే చిన్న పిల్లలపై దాడులు చేయడం, ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను దోచుకోవడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం  కోతుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో మహిళలు, వృద్ధులు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, దుకాణాలు, స్కూల్ ప్రాంగణాలు, ఇళ్ల పైకప్పులు కోతుల తాటికి గురవుతున్నాయి.

ఈ సమస్య పరిష్కారానికి గ్రామ పెద్దలు, సంఘ నాయకులు ముందుకు వచ్చారు. మాజీ సర్పంచ్ చాకలి రమేష్, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, వెలమ సంఘం అధ్యక్షులు చీటి గోపాల్ రావు, గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర సంతోష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చాకలి పర్వతాలు, ఇతర సంఘ ప్రతినిధులు సమావేశమై పరిష్కార మార్గాలను చర్చించారు.

ఈ సందర్భంగా పోతుగల్ గ్రామానికి చెందిన పెద్దమల సంఘం సభ్యుడు కేశవులు ను పిలిపించి గ్రామంలో కోతల బారి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి సంఘం నుంచి సహకారం తీసుకుని ప్రతి నెల రూ.15,000/- నిధి సమకూర్చి కుక్కలను నియమించి కోతుల బారినుంచి గ్రామాన్ని రక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ  “ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని” విజ్ఞప్తి చేశారు.