manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 9:21 am Editor : manabharath

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి..

మన భారత్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ గెస్ట్ హౌస్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పాలన, రాష్ట్ర రాజకీయాలు, ఏపీ స్పెషల్ ప్యాకేజీ అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.

“రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు నోరు విప్పడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అయోమయం నెలకొంది. సీఎం చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీ సంకలో కూర్చున్నా, ఏపీకి స్పెషల్ ప్యాకేజీ గానీ, పోలవరానికి నిధులుగానీ రావడం లేదు,” అని విమర్శించారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పదేళ్ల పాలనలో మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. అది కూడా మోసమే” అని అన్నారు.

అలాగే ఆయన గుర్తుచేశారు — “ఉపాధి హామీ పథకంతో పేదలకు ఉపాధి కల్పించి ఆర్థిక తోడ్పాటు అందించింది యూపీఏ ప్రభుత్వం. దేశంలో సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధికి కారణం రాజీవ్ గాంధీ తీసుకున్న విజనరీ నిర్ణయాలే. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది,” అని తెలిపారు.

“బీజేపీ ఏమైనా మంచి పనులు చేసింది అని చెప్పే ధైర్యం ఉందా? మత రాజకీయాలు, దేవుళ్లకు అడ్డం పెట్టి చేసే పాలనను ప్రజలు నమ్మకండి,” అని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.