manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 8:49 am Editor : Editor Vishal Kumar

ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే

ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్న ఘనత చంద్రన్నదే — టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్
సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం — ఎటపాక పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

మన భారత్, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టిడిపి అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వ శ్రీనివాస్ అన్నారు. ఎటపాక పంచాయతీ పరిధిలోని తుర్రంవారిగుంపు, మేడువాయి, రాయిగూడెం, బొజ్జిగుప్ప గ్రామాల్లో శనివారం ఉదయం ఇంటింటికీ తిరుగుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మువ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ, “వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడు గారిదే,” అని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అన్నదాత భరోసా పథకంను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధులు, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయడం హృదయాన్ని హత్తుకుందన్నారు. “ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసం నిలబెడుతున్నారు,” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

అలాగే రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ అభివృద్ధి పట్ల కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎటపాక సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గోడేటి రవికుమార్, వీఆర్వో రామ్మూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ సక్కుబాయి, సర్వేయర్ పసుపులేటి రాంబాబు, అనుగోజు మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.