manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 4:18 pm Editor : manabharath

సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి

సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి

మన భారత్, హైదరాబాద్, అక్టోబర్ 31:
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందడుగు వేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి, “పటేల్ రాజకీయ నాయకుడు కాదు, రైతాంగ ఉద్యమ నేత. ఆయన దేశ సమగ్రతకు కంచెగా నిలిచారు. సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకే నొప్పి. పీవీ నరసింహారావు అంటే కూడా కాంగ్రెస్‌కు నచ్చదు. వాళ్లకు నచ్చేది కేవలం నెహ్రూ కుటుంబమే” అని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. “పటేల్‌కు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే. పటేల్ లేకపోతే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగరేది కాదు. నిజాం నిరంకుశత్వాన్ని తుదముట్టించిన ఘనుడు సర్దార్ పటేల్” అని తెలిపారు.

తెలంగాణ బిడ్డలు పటేల్ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోరని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చొరవతోనే తెలంగాణ గడ్డపై జాతీయ పతాకం ఎగరిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం అంతా పటేల్ 150వ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. “పటేల్ స్ఫూర్తి ప్రతీ భారతీయుడి హృదయంలో నిత్యం నిలవాలి. వికసిత భారత్‌ లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అదే మార్గంలో సాగుతోంది” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఉక్కు నేత పటేల్: లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ, “నిజాం నిరంకుశత్వాన్ని చెరిపేసిన ఉక్కు నేత పటేల్. దేశ ఐక్యత కోసం ఆయన చేసిన కృషి అపారమైనది. కొన్ని పార్టీలు ఈ మహానేతను గౌరవించడానికి కూడా ఇష్టపడటం లేదు. యువతకు ఆదర్శంగా నిలవాలంటే పటేల్ చరిత్ర తెలుసుకోవాలి. దేశ ఐక్యతకు సాక్ష్యంగా ఉన్న స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ ఘనత ప్రధాని మోడీదే” అని తెలిపారు

అది పటేల్ త్యాగఫలితమే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఇవాళ మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే పటేల్ త్యాగఫలితమే. ఆయన చరిత్రను కొన్ని వర్గాలు కనుమరుగు చేశాయి. దేశ సమగ్రత కోసం ప్రాణం పెట్టిన మహానేత పటేల్ స్ఫూర్తిని తరతరాలకి చేరవేయాలి. నగరంలో అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని నిర్మించుకోవాల్సిన సమయం ఇది” అని పేర్కొన్నారు.