manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 12:33 pm Editor : manabharath

అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం..

సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక నిర్ణయంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ నియామకం ద్వారా మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్‌లో ముస్లిం మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం ఈ నియామకానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమంతో పాటు మరో కీలక శాఖను కూడా అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు ఈ మధ్యాహ్నం అధికారికంగా విడుదల కానున్నాయి.

ఇక విపక్షాలు ఈ పరిణామంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం తగదని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరగా, ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రమాణ స్వీకారం చేపట్టారని తెలిసింది.

రాజ్ భవన్‌లో ఈ వేడుక కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్బార్ హాల్‌లో సీటింగ్, ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్లు క్షుణ్ణంగా నిర్వహించారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో పూర్తి స్థాయి మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌కు ఇప్పుడు గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించబోతున్నారు. ఆయన పేరు కోదండ రెడ్డితో పాటు గవర్నర్‌కు సిఫారసు చేయగా, ఆమోద ప్రక్రియ తుది దశలో ఉందని తెలుస్తోంది.