మొంథా తుఫాను ప్రభావం: పొంగుతున్న వాగుల వైపు వెళ్లవద్దని హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుగులోత్ భావుసింగ్ నాయక్ సూచన
మన భారత్, ఖమ్మం: మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. భావుసింగ్ నాయక్ మాట్లాడుతూ, “వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ప్రజలు కుతూహలంతో లేదా చేపల వేట కోసం వాగుల దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. వర్షాలు తగ్గేవరకు ఇంటి వద్దే సురక్షితంగా ఉండండి” అని సూచించారు. అలాగే ఆయన జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో పాటు, పొంగే వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని, పిల్లలను నీటిముంపు ప్రాంతాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు.
తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పలు తక్కువ ఎత్తులోని ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని, ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.