manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 4:00 am Editor : manabharath

గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడి

బెజ్జూర్ మండలంలో గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు – 40 లీటర్ల గుడుంబా, 1000 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం

మన భారత్, కొమురం భీం ఆసిఫాబాద్:
జిల్లాలో గుడుంబా తయారీదారులపై పోలీసులు బిగుసుకున్న చంకలు. బెజ్జూర్ మండలంలోని లంబడిగూడ గ్రామంలో పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో గుడుంబా, బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జిల్లా ఎస్పీ కాంతి లాల్ పాటిల్, ఎస్డిపిఓ వహీదుద్దీన్ ఆదేశాల మేరకు నిర్వహించబడ్డాయి. కౌటాల సర్కిల్ సీఐ బి. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సిర్పూర్ (టి), కౌటాల, చింతనపల్లి, బెజ్జూర్ మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ దాడుల్లో 40 లీటర్ల గుడుంబా, 1000 లీటర్ల బెల్లం పానకం, అలాగే 5 పత్రాలు సరిగా లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసులు నమోదు చేసి, స్వాధీనం చేసిన గుడుంబా పానకాన్ని ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, “గుడుంబా తయారీ, వినియోగం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం. దాని వల్ల అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి” అని హెచ్చరించారు.

అంతేకాకుండా, ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, లేదా ఫేక్ అకౌంట్లను నమ్మవద్దని సూచించారు. పోలీసుల ఈ చర్యను స్థానిక ప్రజలు స్వాగతించారు. గ్రామాల్లో చట్టవిరుద్ధ గుడుంబా తయారీని అరికట్టేందుకు ఇలాంటి దాడులు తరచుగా జరగాలని వారు అభిప్రాయపడ్డారు.