manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 3:51 am Editor : manabharath

కూలిపోయిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన ఇల్లు

తుఫాను ప్రభావం: కూలిపోయిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన ఇల్లు .. పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి లోకేశ్

మన భారత్,కడప: తుఫాను ప్రభావంతో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోవడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఎడతెరిపిలేని వర్షాలు, గాలివానల కారణంగా స్వామి నివసించిన 16వ శతాబ్దం నాటి మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ ఇంటి భద్రతకు గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని, వర్షాల కారణంగా గోడలు బీటలు పడడంతో చివరికి మొత్తం నిర్మాణం కూలిపోయిందని తెలిపారు. స్వామి భక్తులు, స్థానికులు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఈ ఆధ్యాత్మిక స్థలాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర సమాచార సాంకేతిక, వారసత్వ, సాంస్కృతిక శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. ఆయన ట్విట్టర్ (X) ద్వారా మాట్లాడుతూ, “శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన గృహం కూలిపోయిన విషయం మనకు బాధాకరం. ఈ చారిత్రక స్థలాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించాను” అని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలపై జిల్లా అధికారులు స్థలాన్ని పరిశీలించి, నష్టం వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.