మన భారత్, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అకస్మాత్తు వర్షాలతో పంట పొలాలు నీట మునిగిపోవడంతో పాటు కోతకు సిద్ధమైన వరి ధాన్యం దెబ్బతింటుందేమోనన్న భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతకు సమయం వచ్చిన ఈ దశలో వర్షం కారణంగా అనేకమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని పొలాల్లోనే ఉంచగా, వర్షం వల్ల అది తడిసి పాడైపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు “వరి కోతలు కొయ్యొద్దు, కోసిన ధాన్యాన్ని రోడ్డుపైన ఆరబెట్టొద్దు” అని సూచనలు జారీ చేయడంతో రైతులు రెండో అగ్నికుండంలో ఉన్నట్టు పరిస్థితి నెలకొంది. రైతులు మాట్లాడుతూ, “వరి కోత తర్వాత వెంటనే ఆరబెట్టకపోతే ధాన్యం మొలకెత్తి నష్టపోతుంది. అధికారుల సూచనలు అర్థం అవుతున్నాయి కానీ, వర్షం తాళలేము. పంట మొత్తమే ప్రమాదంలో పడుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో నీటి మునిగిన పొలాలు, చెరువులు పొంగిపొర్లడం కనిపించగా, మున్సిపల్ సిబ్బంది నీరు తగ్గించే చర్యలు చేపట్టారు. వర్షం కొనసాగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తక్కువ ఎత్తులోని ప్రాంతాల వారు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.