manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 10:21 pm Editor : manabharath

అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

మన భారత్, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం ఘనంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రెడ్‌ఫోర్ట్ పురవీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్, ఎస్సై జగన్నాథం నేతృత్వం వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొన్నవారు చేతుల్లో బ్యానర్లు, జెండాలు పట్టుకొని “అమరవీరులకు వందనం”, “జై పోలీస్” అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరుల ఫోటోలపై పుష్పాంజలి ఘటించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు, ప్రజలు మౌనప్రార్థన చేశారు. “పోలీసులు ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులు. వారి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం” అని సీఐ జాన్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యత అని ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. యువతలో దేశభక్తిని, సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.