manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 9:55 pm Editor : manabharath

ఏం చేయబోతున్నామో డిసెంబర్‌ 9న చెప్తా” సీఎం రేవంత్‌ రెడ్డి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సినీ కార్మికులకు శుభవార్త చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. సినీ కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు ప్రత్యేక భవన్‌ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తామని, ఫ్యూచర్‌ సిటీలో సినీ ఫైటర్లకు ప్రత్యేక శిక్షణ స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్‌ చివరి వారంలో సినీ కార్మికులతో సమావేశం నిర్వహించి, డిసెంబర్‌ 9న ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటిస్తామని సీఎం తెలిపారు. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ దేశంలోని ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. “తెలుగు సినిమా కార్మికులు ఎంతో కష్టపడి పరిశ్రమను నిలబెట్టారు. వారికి సరైన వాతావరణం, భద్రత, సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది,” అని ఆయన అన్నారు.

సినీ ఫైటర్లకు శిక్షణ కేంద్రం – భవన్‌ నిర్మాణానికి సాయం..ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలో ఆధునిక సదుపాయాలతో కూడిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అదే విధంగా సినీ కార్మిక సంఘాల కోసం ప్రత్యేక భవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనుంది. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే వేలాది సినీ కార్మికులకు ఊరట కలగనుంది.

సీఎం లక్ష్యం – ‘సినీ పరిశ్రమలో తెలంగాణ ముద్ర’..తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం సృజనాత్మక రంగాలను ప్రోత్సహించడానికి పలు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు.