manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 9:35 pm Editor : manabharath

విద్యార్థులకు భారీ ఊరట..

2022 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

మన భారత్‌, హైదరాబాద్‌:
విదేశాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 సంవత్సరం నుంచి నిలిచిపోయిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క, విద్యార్థులకు మరింత ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, విదేశాల్లో ఉన్న విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు భారీ ఉపశమనం ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద వివిధ దేశాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులు చాలా కాలంగా బకాయిలు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, అన్ని వర్గాల విద్యార్థులకూ న్యాయం చేయాలని నిర్ణయించింది. భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉంది. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్‌ మొత్తాలు త్వరితగతిన విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.