manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 2:47 am Editor : manabharath

టీబీ రహిత గ్రామ లక్ష్యం..

ప్రజల్లో ఆరోగ్య అవగాహనతో ముందడుగు

మన భారత్, తాంసి, అక్టోబర్ 28 : గ్రామాలను టీబీ రహితంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) టీబీ నోడల్ అధికారి రాథోడ్ తులసీ రాం అన్నారు. సోమవారం తాంసి మండల కేంద్రంలోని సబ్‌ సెంటర్‌లో టీబీ వ్యాధి నిరోధక చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ (క్షయ) వ్యాధి పూర్తిగా నయం చేయగలిగేది, కానీ సమయానికి గుర్తించి చికిత్స చేయడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో టీబీ కేసులు తగ్గించేందుకు ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, అనుమానితుల స్క్రీనింగ్, టెస్టింగ్, మరియు తగిన చికిత్స అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో అనుమానితులుగా గుర్తించిన 11 మందిని ఎక్స్రే పరీక్షల నిమిత్తం రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎక్స్రే టెక్నీషియన్ రవీందర్, ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది తాంసి మండలాన్ని టీబీ రహిత మండలంగా మలచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని రాథోడ్ తులసీ రాం తెలిపారు.