manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 2:32 am Editor : manabharath

“సార్‌… మా పంట కొనండి” పోలీసుల కాళ్లు పట్టుకున్న రైతులు!

కామారెడ్డి జిల్లాలో వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన రైతులు — పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం

నస్రుల్లాబాద్‌, (మన భారత్‌ బ్యూరో):
రైతులు పండించిన ధాన్యాన్ని కొనకపోవడంతో ఇద్దరు రైతులు ఆవేదనకు గురై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే— నస్రుల్లాబాద్‌ మండలంలోని పలువురు రైతులు తమ వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల సూచనల మేరకు సొసైటీ ద్వారా సుగుణ రైస్‌మిల్లుకు తరలించారు. అయితే ఆ మిల్లు యజమాని రైతుల ధాన్యాన్ని కొనకుండా తిరస్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. గత యాసంగి సీజన్‌లో రైతుల వడ్లు కొనడం వల్ల నష్టం వాటిల్లిందని, అందుకే ఈసారి వారి ధాన్యం తీసుకోలేనని మిల్లర్‌ స్పష్టంగా చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన రైతులు నస్రుల్లాబాద్‌ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. మిల్లును వెంటనే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసన సమయంలో కొందరు రైతులు కన్నీళ్లతో తమ బాధను వ్యక్తం చేశారు. “మా పంటలు కొనకపోతే చనిపోవడం తప్పదన్నమాట” అంటూ ఎస్సై కాళ్లపై పడి వేడుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన ఇద్దరు రైతులు – సుందర్‌, మైదాస్‌ – ఆవేశంతో పెట్రోల్‌ పోసుకున్నారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు, ఇతర రైతులు వెంటనే అడ్డుకుని ప్రాణాపాయం తప్పించారు. రైతుల వేదన, ఆవేదన చూసిన ప్రజలు కంటతడి పెట్టారు. “పంట పండించటం సులభం కాదు… కానీ పంట అమ్మే దశలో ఇంత అవమానం ఎందుకు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే ఈ సమస్యపై వెంటనే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల బాధను గమనించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మన భారత్‌ స్టేట్‌ బ్యూరో