బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో నడుస్తోంది
రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు?
హైదరాబాద్, అక్టోబర్ 27:
తెలంగాణలో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ మోసపూరితమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. శంషాబాద్‌లో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ మైనారిటీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ – “మైనార్టీల కోసం రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, చివరికి ఒక్క రూపాయినీ ఖర్చు చేయలేదు. ఇది కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనం. కేసీఆర్ పాలనలో మైనార్టీలు గౌరవంగా, భద్రంగా ఉన్నారు. ఇండియాలో మైనార్టీల కోసం కేసీఆర్ చేసినంత సేవ ఎవరూ చేయలేదు” అని స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ మైనారిటీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తారని, కానీ తెలంగాణలో మాత్రం నిశ్శబ్దంగా ఉంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని రాహుల్ గాంధీ విమర్శిస్తారు. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?” అని ప్రశ్నించారు. అంతేకాక, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. “రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో పాటు పది మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. వాళ్లను అడిగితే ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే తెలియదు. కడియం శ్రీహరిని అడిగితే ‘ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా’ అని అంటారు. ఇదే వాళ్ల రాజకీయ స్థాయి” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కేటీఆర్ అన్నారు – “సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మోదీ చేతిలో ఉన్నాయని రాహుల్ గాంధీ చెబుతారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును అదే సంస్థలకు అప్పగించారు. రేవంత్ బంధువులకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయి. బదులుగా రేవంత్ బీజేపీ నేతలకు లాభాలు చేకూరుస్తున్నారు. ఇది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ గవర్నమెంట్” అని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో పురుషులపై భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. “మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి, పురుషుల టికెట్ ధరలు డబుల్ చేయడం ప్రజలతో మోసం చేయడమే” అని వ్యాఖ్యానించారు. ఇక మైనారిటీ ప్రతినిధిత్వం పూర్తిగా లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని కేటీఆర్ విమర్శించారు. “ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కూడా లేరు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ వంటి నేతలను పూర్తిగా పక్కన పెట్టారు. క్రికెట్‌లో అజారుద్దీన్ కట్ షాట్లు కొట్టేవారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అజారుద్దీన్‌ను కట్ చేసేశాడు” అని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మైనారిటీ వర్గాలపై కాంగ్రెస్ వైఖరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి రేపుతున్నాయి.
– మన భారత్ స్టేట్ బ్యూరో