manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 12:09 am Editor : manabharath

బీఆర్ఎస్ నేతలు స్టూవర్ట్‌పురం దొంగలా?”

“మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే… మీరు స్టూవర్ట్‌పురం దొంగలా?” — మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా హరీశ్‌రావుపై విమర్శలు
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మంత్రివర్గాన్ని ‘దండుపాళ్యం బ్యాచ్‌’గా సంబోధించిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు బలహీన వర్గాలపై అవమానకరమని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, “హరీశ్‌రావు నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మా కేబినెట్‌లో బలహీన వర్గాల మంత్రులు ఉన్నారు. అలాంటి మంత్రివర్గాన్ని ‘దండుపాళ్యం బ్యాచ్‌’ అంటారా? మేము దండుపాళ్యం బ్యాచ్‌ అయితే, మీరు స్టూవర్ట్‌పురం దొంగలా?” అని ప్రశ్నించారు. హరీశ్‌రావు మాటలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. “కేసీఆర్ గారూ, మీ అల్లుడిని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఆయన అహంకారం పార్టీని మట్టికరిపిస్తోంది” అని మంత్రి హితవు పలికారు. అడ్లూరి లక్ష్మణ్ ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు కూడా చేశారు. “హరీశ్‌రావు గతంలో 28 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా నిధులు ఇచ్చారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసినందున ఆయనను రెండోసారి మంత్రిగా నియమించలేదు” అని ఆరోపించారు. అలాగే, కాళేశ్వరం అవినీతి అంశంపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, “అప్పుడు చర్చకు రమ్మంటే తోక ముడిచారు, ఇప్పుడు కొప్పుల ఈశ్వర్‌ను పంపుతానంటున్నారు — ఇది హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. “ప్రజలను మభ్యపెట్టే అబద్ధాల రాజకీయాలు ఇక సాగవు. బీఆర్‌ఎస్‌ నేతలు మాటల్లోనూ, వ్యవహారాల్లోనూ బాధ్యత చూపాలి” అని స్పష్టం చేశారు.

— మన భారత్ న్యూస్