manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 8:20 am Editor : manabharath

బోధన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం..

మున్సిపల్ సిబ్బంది నాగమణి దుర్మరణం
స్థానికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదనతో ధర్నా

బోధన్, అక్టోబర్ 27: బోధన్ పట్టణం ఉదయం వేళ ఘోర రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు మున్సిపల్ సిబ్బంది నాగమణి (38)ను ఢీకొట్టి తీవ్ర గాయాలు కలిగించింది. వెంటనే సహచర ఉద్యోగులు, స్థానికులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నాగమణి మృతిచెందింది. నాగమణి బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్‌గా పనిచేస్తూ ప్రతిరోజూ విధులకు వెళ్తూ ఉండేది. సాధారణంగా పనిచేయడానికి బయలుదేరిన ఆమెపై ఆర్టీసీ బస్సు దూసుకురావడం తో ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో మున్సిపల్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదం నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది, కార్మిక సంఘాలు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ పరిధిలో భద్రతా చర్యలను కఠినతరం చేయాలని, రోడ్లపై వేగ పరిమితులను కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పట్టణ ప్రజలు నాగమణి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వ స్థాయిలో ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

– మన భారత్, బోధన్ ప్రతినిధి