manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 12:43 am Editor : manabharath

మంత్రి దామోదర వెరీ సీరియస్

ఎంజీఎంలో నిర్లక్ష్యం కలకలం .. ఇద్దరు పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్
మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్  సూపరింటెండెంట్ సస్పెన్షన్ ఆదేశాలు

మన భారత్, వరంగల్ : ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్‌ను అమర్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మంత్రి వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన ఆయన, ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని, వారి పనితీరు, హాజరు, బాధ్యతలపై పూర్తి నివేదిక సమర్పించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనతో వైద్య సేవల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆధారపడే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యానికీ ప్రభుత్వం సహించదు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు,” అని స్పష్టం చేశారు. ఇదే ఘటన నేపథ్యంలో ఎంజీఎం ఆస్పత్రిలో భద్రతా, వైద్య సిబ్బందిపై విభాగ స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. ఉన్నతాధికారులు ఆస్పత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.