రైతులు కనీస మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని కలెక్టర్ సూచన
మన భారత్, జనగామ: జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ప్రారంభించారు. రైతుల ప్రయోజనార్థం ఈ కేంద్రం ద్వారా పత్తిని కనీస మద్దతు ధర (MSP) కే కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రైతులు మధ్యవర్తుల జోలికి పోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయిస్తే నష్టాలు తప్పి, సరైన లాభాలు పొందవచ్చు. పత్తి నాణ్యతను కాపాడుకుంటూ తేమ శాతం తగ్గిన తరువాతే మార్కెటుకు తేవాలని” సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పత్తి మార్కెట్లలో పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే అధికారులు స్పందిస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, అధికారులు, రైతు నాయకులు, సీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ పత్తి సెంటర్ లో ఏర్పాట్లు, బరువుల కొలత పరికరాలు, నిల్వ సదుపాయాలను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.