కాగజ్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆగ్రహం — విధులు బహిష్కరించి ధర్నా
మన భారత్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
కార్మికులు మాట్లాడుతూ, “ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ప్రయత్నించగా, మున్సిపాలిటీ అధికారులు మా ఈఎస్ఐ చందాలు చెల్లించలేదని వైద్యం నిరాకరించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉందని, వారి కాళ్లు తొలగించకపోతే ప్రాణాపాయం తప్పదని తెలిపారు.
ఈఎస్ఐ నిధులను వెంటనే చెల్లించి, వైద్యం చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తమ డిమాండ్ తీర్చాలని కార్మికులు కోరారు.
“పేద కార్మికుల ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈఎస్ఐ ద్వారా ట్రీట్మెంట్ అందించకపోతే మేము విధులు తిరిగి ప్రారంభించము” అని హెచ్చరించారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట గంటల తరబడి కొనసాగిన ఈ ధర్నాలో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజారోగ్యానికి ప్రమాదం తలెత్తే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.