అర్ధరాత్రి ఇసుక దందా బీభత్సం..!
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ – కలెక్టర్ ఆదేశాలపై అధికారుల నిర్లక్ష్యం
మన భారత్ ఆదిలాబాద్ : తాంసి మండలంలో రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది . ప్రభుత్వం ప్రజల గృహ కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు కొందరికి దోపిడీ ధారావాహికగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక స్థాయిలో లబ్ధిదారుల పై పెరిగిన భారంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భీంపూర్ మండలంలోని గోల్లఘాట్ నుంచి తాంసి మండల కేంద్రంతో పాటు కప్పర్ల, జామిడి, సవర్గాం గ్రామాలకు రోజూ రాత్రి వేళల్లో ఇసుక ట్రాక్టర్లు నిరభ్యంతరంగా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఒక్క ట్రాక్టర్ ఇసుక రూ.2,500కి లభించగా, ఇప్పుడు రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జీరో కాస్ట్ ఇసుక అందించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మండల, గ్రామ స్థాయి అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకపోవడం గమనార్హం.
స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు — భీంపూర్ మండల రెవెన్యూ, పోలీస్ అధికారుల కనుసన్నల్లో ఈ అక్రమ రవాణా ఎలా జరుగుతోంది? ఇసుక మాఫియాకు ఎవరూ అడ్డుకట్ట వేయరా? అని.
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న పథకం నిజంగా పేదల గృహ నిర్మాణానికి ఉపయోగపడాలంటే అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణాను అరికట్టి జీరో కాస్ట్ ఇసుకను లబ్ధిదారులకు అందేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.