manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 11:25 am Editor : manabharath

మధ్యాహ్న భోజనం నిధులు రూ.98.3 కోట్లు విడుదల

మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కోట్లు విడుదల
వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు – విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్

మన భారత్, హైదరాబాద్:
రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.98.3 కోట్లను ఈ పథకం కోసం కేటాయిస్తూ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ. నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల ప్రకారం, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి, వంట ఖర్చులకు, గుడ్డు సరఫరాకు రూ.25.64 కోట్లు, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల భోజన ఖర్చులకు రూ.28.43 కోట్లు, వంట కార్మికుల గౌరవ వేతనాలకు రూ.44.73 కోట్లు కలిపి మొత్తం రూ.98.3 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

సంచాలకులు నవీన్ నికోలస్ మాట్లాడుతూ, గతంలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం నిధులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏప్రిల్‌ నుండి జులై వరకు విడుదల చేసినట్లు చెప్పారు. వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం వంట కార్మికులకు నెలకు రూ.2,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నామని తెలిపారు.

మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకే ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ ఈ పథకాన్ని కొనసాగిస్తూ మొత్తం వ్యయాన్ని స్వయంగా భరిస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్మీడియేట్‌ స్థాయివరకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలన్న డిమాండ్‌ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల వర్గాల నుంచి వస్తున్నదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల హితాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.