స్థానిక ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం పయనం
బీసీ రిజర్వేషన్లు, ఇద్దరు పిల్లల నిబంధన రద్దుపై కీలక నిర్ణయాలు కేబినెట్ అజెండాలో
మన భారత్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక కేబినెట్ సమావేశం గురువారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్టులు వంటి పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు.
ఇటీవల హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సమీక్షించనుంది. న్యాయ పరమైన ఆంక్షలు లేకుండా రిజర్వేషన్ల అమలుకు తగిన మార్గం ఎంచుకోవడంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇక, ఇద్దరు పిల్లల నిబంధన కారణంగా ఎన్నికలకు అర్హత కోల్పోతున్న ప్రజాప్రతినిధుల సమస్యపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధనను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌కి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రాజెక్టుల పురోగతి, పునరావాస సమస్యలు, రాబోయే ఖరీఫ్ సీజన్ నీటి అవసరాలు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి అంతా ఇప్పుడు ఈ కేబినెట్ సమావేశం పైనే కేంద్రీకృతమైంది.