manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 3:06 pm Editor : user5442714

ఆత్మగౌరవ పరిరక్షణకు దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మాజీ మంత్రి జోగు రామన్న

అమరవీరులకు నివాళులు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 29,

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దీక్షా దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. తొలుత తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాట ఘట్టాలు, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జోగు రామన్న సందర్శించారు. ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన చిత్రాలను పరిశీలించారు.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మకం

అనంతరం ఏర్పాటు చేసిన సభలో జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ ఉద్యమ బాట పట్టారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక వేలాది మంది ఉద్యమకారుల పోరాటం, అమరవీరుల త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జోగు రామన్న విమర్శించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి మారినంత మాత్రాన తెలంగాణకు ఇంత నష్టం జరగాలా? అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు.

కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఆదర్శం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రభావం నేటికీ ప్రజల్లో ఉందని జోగు రామన్న పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయని అన్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించే విధానంలో కేసీఆర్ ఆలోచనలు ఇతర ప్రభుత్వాలకు సైతం స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ యోజన వంటి పథకాలు కూడా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కొనసాగుతున్నాయని ప్రస్తావించారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమ స్ఫూర్తి అవసరం

నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక ఇబ్బందులు, రైతాంగ సమస్యలు సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని జోగు రామన్న విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, పట్టణ అధ్యక్షుడు అజయ్, యూనిస్ అక్బని, మార్శెట్టి గోవర్ధన్, ప్రమోద్ రెడ్డి, గంభీర్ టాక్టర్, గండ్రత్ రమేష్, సాజితోద్దీన్, చందాల రాజన్న, స్వరూప రాణి, బుడగం మమత, పరమేశ్వర్, దేవన్న, దాసరి రమేష్, దమ్మపాల్, కొండ గణేష్, కోరెడ్డి ప్రవీణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మన భారత్,



(adsbygoogle = window.adsbygoogle || []).push({});