manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 3:03 pm Editor : user5442714

జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష..

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

28 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు.. 10,104 మందికి గాను 9,016 మంది అభ్యర్థుల హాజరు

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.. 300 మంది పోలీసు సిబ్బందితో భద్రత

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 29:

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్) ప్రాథమిక రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 10,104 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంది. వీరిలో 9,016 మంది అభ్యర్థులు హాజరుకాగా, 1,088 మంది గైర్హాజరయ్యారు.

జేఎన్టీయూ, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు.

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదిలాబాద్ వన్‌టౌన్, టూటౌన్, రూరల్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను, పరీక్షల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా

పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అధిక శబ్దాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేసి ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో మినహా పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

సమన్వయంతో విధులు నిర్వహించాలి

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పరీక్షా విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేంద్రం వద్ద భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని తెలిపారు.

ఈ పర్యటనలో అదనపు ఎస్పీ పి. మౌనిక ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, స్థానిక సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, బి.డి. ప్రేమ్ కుమార్, రహీం పాషా, డి. వెంకటి, టి. మురళి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్



(adsbygoogle = window.adsbygoogle || []).push({});