manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 1:24 am Editor : user5442714

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు – ఎంపీ గోడం నగేష్

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు – ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆర్ఆర్ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ.. పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28,

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని ఆర్ఆర్ నగర్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు వివరించారు.

అమృత్ పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల రెండు మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, పనులు చేపడుతున్న ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలోనూ పట్టణంలోని పలు సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు, మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు.

గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అనేక సమస్యలను ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఆదిలాబాద్‌కు ఉన్న గుర్తింపును తొలగించి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో ఆదిలాబాద్‌లో విమానాశ్రయం, ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అభివృద్ధి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే నగర అవసరాలు మరింత పెరుగుతాయని, వాటికి అనుగుణంగా ఇప్పటి నుంచే పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని వివరించారు.

ప్రజాధనంతో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});