మద్యం, గుట్కా నిల్వలపై ఎస్ఐ ముప్పు సురేష్ ఉక్కుపాదం!
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మొగుళ్ళపల్లి: నవంబర్ 28, (మన భారత్):
మొగుళ్లపల్లి మండలంలో అక్రమ మద్యం, గుట్కా నిల్వలపై ఎస్ఐ ముప్పు సురేష్ ఉక్కుపాదం మోపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఘాటుగా హెచ్చరించారు. శనివారం మొట్లపల్లి గ్రామంలో ఆయన పోలీసులతో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కేవలం 100 మీటర్ల దూరంలో కిరాణం షాపుల ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతోనే ఈ దాడులను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ దాడిలో ఇద్దరు అక్రమ వ్యాపారులు పట్టుబడ్డారు. శ్రీ లక్ష్మీ నరసింహ కిరాణం షాపు యజమాని మెండు రవితేజ (42) ఇతని వద్ద నుండి 9.360 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం, 15.600 లీటర్ల బీర్లు (మొత్తం విలువ రూ.14,196/-) స్వాధీనం చేసుకున్నారు. బజ్జూరి రమాదేవి (58) ఈమె వద్ద నుండి 6.50 లీటర్ల బీర్లు (విలువ రూ.1,625/-) స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, మద్యం నిల్వలను సీజ్ చేశామని ఎస్ఐ సురేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడారు. ప్రభుత్వ బడులు, విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో మద్యం, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, అమాయక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటే అస్సలు సహించేది లేదని, ఇలాంటి వ్యాపారాలు చేసే వారిని ఉపేక్షించేది లేదు, కఠినంగా శిక్షిస్తామని, జైలుకు పంపుతామని, పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ ముప్పు సురేష్ దూకుడు చర్యలతో మండలంలోని అక్రమ వ్యాపారుల్లో వణుకు మొదలైంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
