గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
– శాఖల వారీగా సమన్వయంతో విధులు నిర్వహించాలి
– ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు
– అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ :
ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి, వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన, కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్టీయూలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నేపథ్యంలో ఆయా శాఖలకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. హెలిప్యాడ్‌కు సంబంధించిన కోఆర్డినేట్స్ స్పష్టంగా సిద్ధంగా ఉంచుకోవాలని, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు, హెలిప్యాడ్ పరిసరాల్లో వాటరింగ్, భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గవర్నర్‌కు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు అనే వివరాలు ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే స్పష్టంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా గెస్ట్ హౌస్ వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కొండగట్టు ఆలయం వద్ద గ్రీన్ కార్పెట్, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, టెంట్లు తదితర ఏర్పాట్లను పక్కాగా చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి అనుమతించే వారి సంఖ్యను నియంత్రించాలని, అధిక సంఖ్యలో ప్రజలను అనుమతించకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, అమలు తీరు, సంబంధిత సమాచారం అధికారులకు పూర్తిగా తెలిసి ఉండాలని, గవర్నర్ అడిగే ప్రతి అంశానికి స్పష్టమైన వివరాలతో సమాధానం చెప్పే విధంగా అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ సూచించారు. గవర్నర్, వీఐపీలకు ఏర్పాటు చేసే భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గవర్నర్ వారి మెనూ ప్రకారం ఎన్ని రకాల వంటకాలు సిద్ధం చేయాలి, వాటి నాణ్యత, తయారీ విధానం తదితర అంశాలను ముందుగానే నిర్ధారించుకోవాలని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలు, ఆహ్వానించాల్సిన ప్రముఖుల జాబితా, వారి హాజరు తదితర వివరాలను స్పష్టంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులకు కూడా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని, పర్యటన కవరేజీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. గవర్నర్ పర్యటనకు సంబంధించిన ప్రతి అంశంపై సంబంధిత శాఖల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గవర్నర్ పర్యటన విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం. ప్రసూనాంబ, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి , జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
