మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఫూలే సేవలు, సామాజిక న్యాయ పోరాటం చిరస్మరణీయం: మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, తలమడుగు:నవంబర్ 28,
సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం అందించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని బీసీ సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సామాజిక సేవలను, సమాజ మార్పు కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలోని కుల వివక్ష, సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మి, ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి సైతం ఆదర్శప్రాయమని అన్నారు.
ఫూలే ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, కులమత భేదాలకు అతీతంగా సామాజిక న్యాయంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు చేరినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భోజ గౌడ్, సురేందర్, నారాయణ్ షిండే, షకీల్, గణేష్ వర్మ, అఖిల్, దీక్షిత్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
