ఎల్‌నినో ప్రభావం.. రాబోయే 8 నెలలు వర్షాలు కురిసే అవకాశం లేదు!
కోవిడ్ తరహా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.. రైతులను చైతన్యపరచాలి
ప్రకృతి పరిరక్షణకు సమగ్ర విధానం రూపొందిస్తాం.. తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మన భారత్:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ సంక్షోభాన్ని కోవిడ్ మహమ్మారి తరహాలోనే ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎనిమిది నెలల పాటు వర్షాలు కురిసే పరిస్థితులు ఉండకపోవచ్చని, నీటి కొరతను అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ నీటి లభ్యత ప్రధాన సమస్యగా మారనుందని తెలిపారు. రైతులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన స్మార్ట్ తెలంగాణ నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తుఫానులు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు తక్షణమే నష్టాన్ని కలిగిస్తాయని, కరువు మాత్రం నెమ్మదిగా ప్రారంభమై క్రమంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. ప్రస్తుత చలికాలంలోనే ఎండాకాలం తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, రైతులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. రైతులు అవసరాన్ని బట్టి ఒక పంటను త్యాగం చేసి పశుసంపదను కాపాడుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించడం వల్లే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని సీఎం అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల సాధన, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. నిపుణులు, పర్యావరణవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధుల సూచనలతో సమగ్ర పర్యావరణ విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణకు చెరువుల నిర్మాణం, నీటి సంరక్షణలో గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి చెరువులు మన పూర్వీకుల దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, బతుకమ్మకుంట పునరుద్ధరణతో ప్రజలకు మళ్లీ పండుగ సంబరాలు జరుపుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవనం కూడా భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసమే చేపడుతున్నామని తెలిపారు.
హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ తక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించబడిందని, ప్రస్తుతం కుండపోత వర్షాలు, క్లౌడ్‌బరస్ట్ వంటి పరిణామాలు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని వివరించారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి కొరత ఉన్నప్పుడు పరిశ్రమలకు శుద్ధి చేసిన నీటిని అందించే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. చెరువుల ఆక్రమణలను తొలగించి వాటిని పునరుద్ధరించాలని, మూసీ నది అభివృద్ధికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక నమూనాను రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, పద్మశ్రీ రైతు చింతల వెంకట్ రెడ్డి, పర్యావరణ నిపుణులు, ప్రొఫెసర్లు, అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
