manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 12:55 am Editor : user5442714

సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు.. యువకుడి అరెస్ట్

సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు.. యువకుడి అరెస్ట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర వీడియో పోస్టు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఫొటోలు పెట్టి భయాందోళనలకు గురిచేసిన నిందితుడు

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు – ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్

మన భారత్, గుడిహత్నూర్, నవంబర్ 27:

సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతర మతాల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టులు చేసిన యువకుడిపై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన రాథోడ్ అర్జున్ (20), తండ్రి వినోద్, ఈ నెల 26వ తేదీన ‘మన గుడిహత్నూర్’ అనే వాట్సాప్ గ్రూపులో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న అభ్యంతరకర వీడియోను పోస్టు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ వీడియోలో ఒక మతానికి చెందిన వారిని కించపరిచే వ్యాఖ్యలు ఉండటంతో పాటు, రెండు మతాల మధ్య శత్రుత్వం, విద్వేషాలు పెరిగేలా ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక, ఇతర ఆధారాల ద్వారా వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో పోస్టులు

ఇదే నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఉన్న చిత్రాలను పోస్టు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని ప్రజలను భయపెట్టడం, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియా వినియోగంలో బాధ్యత అవసరం: సీఐ

ఈ సందర్భంగా ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఇతర మతాలు, కులాలు, వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. సమాజంలో మత సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇతరులు పంపిన అభ్యంతరకరమైన వీడియోలు, పోస్టులను కూడా పరిశీలించకుండా వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ కేసు దర్యాప్తు, నిందితుడి అరెస్ట్‌లో గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});