పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తాంసి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ.. గంజాయి, గ్యాంబ్లింగ్, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం
మన భారత్, తాంసి, నవంబర్ 27:
పోలీస్ స్టేషన్‌లోని అన్ని రకాల రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, అక్కడ ఉన్న వాహనాలు, వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, మాల్ఖానా నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న అంశాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
కోర్టు డ్యూటీ అధికారుల పనితీరును సమీక్షిస్తూ కేసుల్లో పటిష్టమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా అవసరమైన ఆధారాలను సేకరించాలని సూచించారు. న్యాయస్థానాల నుంచి జారీ అయ్యే నాన్ బెయిలబుల్ వారెంట్ల (NBW) అమలులో నిర్లక్ష్యం చేయకుండా వాటిని త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజల్లో గౌరవం, నమ్మకం మరింత పెరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు నిజాయితీగా, నిస్వార్థంగా సేవలందిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
మండల పరిధిలో గంజాయి విక్రయాలు, జూదం, అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై చట్టపరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాలను తరచూ సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, డిజిటల్ చెల్లింపుల మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడిన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసేలా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌లో విధుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ తనిఖీలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, తాంసి ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అంజమ్మ, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
