బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం, విద్యావకాశాలకు నష్టం – కలెక్టర్ రాజర్షి షాతో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 27,
బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి కృషి చేయాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు సమాజంలో కొనసాగుతున్న సామాజిక దురాచారమని, వీటి కారణంగా చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడటంతో పాటు వారి ఆరోగ్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం, బాలల హక్కుల మాసోత్సవాల సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై బాల్య వివాహాల నిర్మూలన ఆవశ్యకతపై మాట్లాడారు.
ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలికలు చిన్న వయసులోనే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వారి చదువుకు ఆటంకం కలగడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాలికలకు నాణ్యమైన విద్య అందించి, తమ లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలన అనేది ఒక్క ప్రభుత్వ శాఖకు మాత్రమే పరిమితమైన బాధ్యత కాదని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వాటిని అడ్డుకోవాలని సూచించారు.
బాలల హక్కులను పరిరక్షించడం, ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, సీడీపీఓ సౌందర్య, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
