ఖాన్ అకాడమీ అమలులో ఉత్తమ ప్రతిభ.. ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసలు
ముగ్గురు హెచ్ఎంలకు ప్రశంసాపత్రాలు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26,
జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖాన్ అకాడమీ విద్యా కార్యక్రమం అమలులో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 109 ఉన్నత పాఠశాలల్లో ఖాన్ అకాడమీ కార్యక్రమం అమలవుతోంది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థులకు డిజిటల్ విద్యా వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపిన ప్రధానోపాధ్యాయులను అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో పొన్నారి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశంకర్, వడ్డాడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమారెడ్డి, తాంసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్‌లను కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో వినియోగించుకుంటూ విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించాలని పేర్కొన్నారు.
విద్యా కార్యక్రమాల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అభినందించడం పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రోత్సాహాన్ని అందించింది.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాధవి, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
