కేజీబీవీ తాంసిలో 90 శాతానికి పైగా విద్యార్థుల హాజరు
ప్రత్యేక అధికారిణి ప్రియాంకను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తాంసి:నవంబర్ 26,
విద్యార్థుల క్రమబద్ధమైన హాజరుతోనే మెరుగైన విద్యా ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. తాంసి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రతి నెలా 90 శాతానికి పైగా విద్యార్థుల హాజరు నమోదు అయ్యేలా ప్రత్యేక చొరవ చూపిన పాఠశాల ప్రత్యేక అధికారిణి ప్రియాంకను కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) డి. మాధవి అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు.
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక అధికారిణి ప్రియాంక నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ, వారికి చదువుపై ఆసక్తి కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా నమోదవుతున్న హాజరు వివరాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ప్రతి నెలా 90 శాతానికి పైగా హాజరు సాధించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడాలని, చదువుపై ఆసక్తి పెంపొందించేలా బోధన సాగించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిస్తే ఆశించిన విద్యా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
కేజీబీవీ తాంసిలో మెరుగైన హాజరు శాతం నమోదుకు కృషి చేసిన ప్రత్యేక అధికారిణి ప్రియాంకను జిల్లా ఉన్నతాధికారులు అభినందించడం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో డీఈఓ డి. మాధవి, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
